ఉదయం లేస్తూనే ఫెస్ బుక్ చూసుకోవటం మంచిదేగానీ దానికే అతుక్కుపోకూడదు | Mark Zuckerberg Wikipedia in Telugu

ప్రతి రోజు మనం ఏ రకమైన బట్టలు వేసుకోవాలి, ఏ రకమైన షూస్ వేసుకోవాలి., అనే విషయాల గురించి ఆలోచించే అవసరం ఉండకూడదు, ఇలాంటి విషయాలపైన సాధ్యమైనంత తక్కువ సమయాన్ని కేటాయించాలన్నదే నా ఉద్దేశ్యం.


ఫెస్ బుక్ వ్యవస్థాపకుడు, యువతరానికి ఆరాధ్యుడు.. కావాలంటే క్షణానికో ఖరీదైన డ్రస్సు మార్చుకోగలిగిన ప్రపంచ సంపన్నుడు జుకర్ బర్గ్. కానీ ఎప్పుడూ గ్రే రంగు టీషర్టు, నీలం జీన్స్,  అప్పుడప్పుడు హుడీ.. వీటిలోనే కనబడతాడు. వాడే కారూ చాలాకాలంగా అదే. ఎందుకలా? ఆయన్నే అడిగితే.. “ప్రతి రోజూ మనమేం బట్టలేసుకోవాలి, ఏం షూ తొడుక్కోవాలి వంటి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. ఇలాంటి వాటి మీద సాధ్యమైనంత తక్కువ సమయం వెచ్చించాలన్నదే నా ఉద్దేశం. 

ఆ సమయాన్ని కూడా కొత్త ఆలోచనల మీద, కొత్త నిర్ణయాల మీదే వెచ్చించాలనుకుంటాన్నేను” అంటాడాయన. జుకర్ బర్గ్ వారానికి 60 గంటలు పని చేస్తాడు. ఉదయం 8కి నిద్ర లేస్తూనే మంచం దిక్కుండానే ఒక్కసారి ఫేస్బుక్, మెసెంజర్, వాట్సప్.. చకచకా చూసేస్తాడు. “నిజం చెప్పాలంటే అదో బాధ. నేను కాంటాక్ట్ లెన్సులు వాడతా. అవి లేకుండా సరిగ్గా చూళ్లేను. కానీ పొద్దున్నే లేస్తూనే లెన్సుల్లేకుండా Facebook చూడాలంటే ఫోను కళ్లకు చాలా దగ్గరగా పెట్టుకుని చూడాల్సి  వస్తుంటుంది” అంటాడాయన. లేస్తూనే ఒక్కసారి మెయిల్స్, మెసేజ్లు చూసుకోవటం మంచిదేగానీ దానికే అతుక్కుపోకూడదంటాడు. 

లేచిన తర్వాత ఒక్కసారి భార్య, పిల్లలతో మాట్లాడటం, తర్వాత వారంలో 3 రోజులు వ్యాయామం. అది లేనిరోజున కుక్కతో బయట పరుగెత్తటం అలవాటు. ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన ఫేస్ బుక్ ను నడపటం తేలికేం కాదు. అయినా ప్రతి 2 వారాలకో పుస్తకం చదువుతుంటాడు. చైనా భాష మాండరిన్ నేర్చుకోవటం, తన ఇల్లు మొత్తానీ కృత్రిమ మేధతో అనుసంధానించటం.. ఇలా ప్రతి ఏడాదీ తనకు తానే లక్ష్యాలు పెట్టుకుంటాడు. ఇవి తనకు కొత్త ఉత్తేజాన్నిస్తాయంటాడు. ట్వీటర్లో కనబడటం చాలా అరుదు. ఇద్దరు కూతుళ్లతో కలిసి రాత్రిపూట ప్రార్ధన చేయటం, దూర ప్రయాణాలకు వెళ్లటం  ఇష్టం. కుటుంబ బంధాలు బలంగా ఉండాలని ఎంతగా నమ్ముతాడంటే పాప పుట్టినప్పుడు ఫేస్బుక్ ఆఫీసుకు ఏకంగా రెణ్నెల్లు సెలవు పెట్టేసి ఇంటివద్దే ఉండిపోయాడు.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!