పేదరికం నుంచి వచ్చిన దాన్ని కదా.. నా డబ్బు మరొకరి చేతుల్లో పెట్టలేను | Oprah Winfrey History in Telugu

మనకు దక్కిన దానితో సంతోషంగా ఉంటె ఇంకా ఎక్కువ పొందగలుగుతాం, లేనిదాని మీద ద్రుష్టి పెడుతుంటే ఎప్పటికి కావాల్సినంత పొందలేము.

టివి వ్యాఖ్యాతగా మొదలు పెట్టి ప్రపంచ ఖ్యాతి, సంపదలను సొంతం చేసుకున్న ఓప్రా విన్ఛే.. రోజు గడిపే తీరు చూస్తే జీవితంలోని ప్రతి చిన్న అంశంలోనూ ఇంతటి ఈ ఆనందాన్ని పొందచ్చా? అని ఆశ్చర్యం వేస్తుంది. సముద్రం దగ్గర్లోనే 65 ఎకరాల సువిశాలమైన తోటలో ఉంటుంది ఓప్రా ఇల్లు. పొద్దున్నే 7.10కి లేచి.. ఒక్కసారి కిటీకీలోంచి నులివెచ్చటి కిరణాల్లో మెరుస్తున్న తోటను చూస్తారు ఓప్రా. “దీంతో కాఫీ కూడా తాగక ముందే నాకు బోలెడంత ఉత్తేజం వచ్చేస్తుంది” అంటారామె. 8కల్లా బ్రషింగ్ చేసుకుని తమ ఐదు కుక్కలను తీసుకుని తోటలోకి వెళతారు. 8.30కల్లా ధ్యానం. “మా ఇంటిచుట్టూ 3000 చెట్లుంటాయి. ధ్యానం కోసం ఆ మధ్యలోనే ఒక చిన్న రాయి మీద కూర్చున్నప్పుడు నాకింతకంటే ఏం కావాలనిపిస్తుంది” అంటారామె. 

9కి ఇంటి చుట్టూ పరుగు, కొన్ని వ్యాయామాలు. 10. 30కల్లా షూటింగులు, మీటింగులు మొదలెట్టేస్తారు. ఒక్క గురువారం మాత్రం తోటలోకి వెళ్లి పండ్లు కోసుకోటం, దుంపలు తవ్వుకోటం వంటి పనుల్లో నిమగ్నమవుతారు. 12.30కి భోజనం. తమ పెరట్లో పెంచే వీలున్న ఏ వస్తువునూ బయటి నుంచి కొనరు! 1.30కి వాణిజ్య సమీక్షలు. ఎన్ని చెక్కులున్నా తనే సంతకం పెట్టాలి.

పేదరికం నుంచి వచ్చిన దాన్ని కదా.. నా డబ్బు మరొకరి చేతుల్లో పెట్టలేను. కరెంటు బిల్లుల నుంచి ప్రతిదీ నాకు తెలియాల్సిందే” అంటారు. 4 కల్లా తాము ఇష్టంగా కట్టుకున్న టీహౌస్సకు వెళ్లి పుస్తకాల్లో, కవిత్వంలో మునిగిపోతారు. 6 గంటలకు భోజనం. ఇంతటి ప్రపంచ ప్రఖ్యాత టీవీ తార.. తన జీవితంలో కొన్ని వారాల పాటు అస్సలు ఇంట్లో టీవీ ఆన్ చెయ్యకుండానే గడిపేస్తారు! 9.30కి నింపాదిగా స్నానం, నిద్ర. “అంతా అనొచ్చు.. ఓప్రాలాగా అన్నీ ఉంటే మేమూ ఇలాగే గడుపుతామని. కానీ చాలా ఏళ్లు నేను చీకట్లోనే పనికెళ్లి, మళ్లీ చీకట్లోనే తిరిగొచ్చేదాన్ని. పగటి ఆకాశం ఎలా ఉంటుందో తెలీని రోజులెన్నో! అందుకే ఇప్పుడు నేను ప్రతి చిన్న అంశాన్నీ తీరిగ్గా పట్టించుకుని, వాటి నుంచి కూడా ఆనందాన్ని పొందుతున్నా” అంటారామె.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!