ఇలాంటి నాయకులు మళ్ళీ పుడతారా … డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి లైఫ్ స్టోరీ

ప్రజల గుండె చప్పుళ్లను విన్నారు..! వారి వెతలను కళ్లతో చూశారు..! నేనున్నానంటూ.. భరోసానిచ్చారు..! అత్యధిక మెజార్టీతో గెలిచి.. ప్రజాకర్షక పథకాలతో.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. ఆయనే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8 న వైఎస్ఆర్ కడప జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టర్ గా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల తిరుపతినుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి ఎస్వీఆర్ ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత కొద్దిరోజులపాటు జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపాయికే తన వైద్య సేవలను అందించాడు.

కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించాడు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేతగానూ, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించాడు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 1,467 కిలోమీటర్లు నడిచారు. 2003 వేసవి కాలంలో ఆయన ఈ పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో రైతులు,పేద విద్యార్థులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. అప్పుడు ఆయన వ్యవహరించిన తీరు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. అధిష్టానం రాజశేఖరుడినే సీఎంగా నియమించింది.

దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం రాజశేఖరరెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టారు. 108, 104 సేవలతో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేశారు. దీంతో వైఎస్సార్ పలువురికి ఆరాధ్య సీఎం అయ్యారు. మరికొందరికి దేవుడయ్యారు.

2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంతో రెండో సారి సీఎం అయ్యారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు ఆయన సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. సెప్టెంబర్ 2, 2009 ఆయనకు చివరి రోజు. ఆయన మరణంతో ఎందరో గుండెలు ఆగాయి. రాష్ట్రమే కాకుండా దేశమే ఆయన కోసం రోధించింది. ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో మంది మనస్సుల్లో నిలిచిపోయారు.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!