ఆంధ్ర ప్రదేశ్ గ్రూప్ 1 పరీక్షల షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించాలని గతంలో నిర్ణయించిన ఈ పరీక్షలను జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ పరీక్షలకు సంబంధించిన మూడోవిడత ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరుగనుండడంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు ఇంటర్వ్యూల్లో విజయం సాధించేలా సన్నద్ధమయ్యేందుకు వీలుగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు
ఎస్.సలాంబాబు తెలిపారు. రాష్ట్రం నుంచి 25 మందికి పైగా సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి సివిల్స్ ఎక్కువమంది విజయం సాధించేలా ఆయా అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వెసులుబాటు కల్పించేందుకు కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 3, 5, 6, 7, 8, 9, 10 వ తేదీల్లో గ్రూప్-1 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. కమిషన్ ఇచ్చే ఏ నోటిఫికేషన్ అయినా సకాలంలో పూర్తిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చిన నేపథ్యంలో కమిషన్ అదేబాటలో నడుస్తోంది. టైమ్ బౌండ్లో ఆయా నోటిఫికేషన్లను పూర్తిచేసి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేలా చేసింది. గ్రూప్-1 పోస్టుల విషయంలోను అదేరీతిన నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ ఫలితాల వరకు చర్యలు తీసుకుంది. ఇంటర్వ్యూలు ఉండే పోస్టుల నోటిఫికేషన్లను తొమ్మిదినెలల్లో, ఇంటర్వ్యూలు పోస్టుల నియామకాలను ఆరునెలల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ ను మూడునెలల్లోనే పూర్తిచేయించి పోస్టులు భర్తీచేయించింది.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!